Nalgonda Municipal Corporation: నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించిన సందర్భంగా నల్గొండ ప్రజల తరఫున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాల కాలంలో పట్టణాభివృద్ధి కోసం సుమారు రూ.2,000 కోట్లు ఖర్చు చేశామని, అవసరమైతే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇంకా రూ.2,000 కోట్లు తెచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
నల్గొండ ప్రజల ఆకాంక్ష మేరకు కార్పొరేషన్ హోదా కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వ పాలనలో నల్గొండ అభివృద్ధికి కొత్త దిశ లభించిందని అన్నారు. కేవలం 25 నెలల్లోనే కార్పొరేషన్ హోదా సాధించడం చారిత్రక విజయమని పేర్కొన్నారు.
కార్పొరేషన్ హోదాతో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు పొందే అవకాశం లభించిందని, దీని వల్ల గతంతో పోలిస్తే వేగవంతమైన, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
నల్గొండ అభివృద్ధిలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, రూ.700 కోట్లతో ఓఆర్‌ఆర్ నిర్మాణం, ధర్వేశిపురం వరకు 6 లైన్ల రోడ్డు అభివృద్ధి, బ్రహ్మగారి గుట్ట–లతీఫ్ సాబ్ దర్గా గుట్ట అభివృద్ధి, దొరేపల్లి–అనంతారం రోడ్ల విస్తరణ చేపడతామని వెల్లడించారు. అలాగే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి లక్ష్యంతో పాటు ఏఎంఆర్‌పీ కాలువల లైనింగ్‌కు రూ.450 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
తనను ఆప్యాయంగా ఆదరించిన నల్గొండ ప్రజల కోసం ఎంత చేసినా తక్కువేనని భావిస్తున్నానని, రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ తరహా అభివృద్ధిని నల్గొండలో తీసుకొస్తామని చెప్పారు. శాంతి, సమరస్యాలతో కార్పొరేషన్ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


