National Youth Day: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి వివేకానంద గారి ఆదర్శాలను అలవర్చుకుని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి యువకుడు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావాన్ని పెంపొందించడంలో స్వామి వివేకానంద గారి బోధనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి యువత చేతుల్లోనే ఉందని పేర్కొంటూ, వారి ఆలోచనలు యువతకు నిరంతర ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు.
స్వామి వివేకానంద గారి జీవితం, వారి సందేశాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని ముఖ్యమంత్రి గారు అన్నారు. యువత కేవలం ఆ మహానీయుడి ఆలోచనలను స్మరించడమే కాకుండా, వాటిని దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అవుతుందని స్పష్టం చేశారు.
యువత శక్తిని సరైన దిశలో మలిస్తే రాష్ట్రం, దేశం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్న ముఖ్యమంత్రి గారు, లక్ష్య సాధనలో పట్టుదల, నైతిక విలువలు, సేవా దృక్పథంతో ముందుకు సాగాలని యువతకు సూచించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


