Jagtial District Collector 2026 : కలెక్టర్ కీలక సందేశం
గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా అధికారులు, ఉద్యోగులు పరస్పర సహకారంతో సమర్థవంతంగా పని చేసి విజయవంతం అయ్యారని అభినందించారు. అదే ఉత్సాహంతో 2026 సంవత్సరంలో కూడా మరింత బాధ్యతాయుతంగా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అలాగే ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొంటూ, ప్రతిరోజూ యోగా, వ్యాయామం, ఉదయపు నడక అలవాటు చేసుకోవాలని, తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని, ఆరోగ్యంగా ఉండి తమ తమ రంగాల్లో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ నూతన సంవత్సర వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి, జిల్లా అధికారులు, ఉద్యోగస్థులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


