Dalit Atrocities Telangana: బాధితుడికి అండగా నిలిచిన కేటీఆర్
వరంగల్ / హైదరాబాద్: వరంగల్ నగరానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ 29వ డివిజన్ అధ్యక్షుడు, దళిత సామాజికవర్గానికి చెందిన కొడకండ్ల సదాంత్‌పై అధికార పక్షం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రంగా ఖండించారు.
ఆదివారం హైదరాబాద్ నందినగర్ నివాసంలో బాధితుడు సదాంత్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, దోమ రమేష్లతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకత్వం, మున్సిపల్ అధికారులు కలిసి తనపై ఎలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో సదాంత్ వివరించారు.
వరంగల్ భద్రకాళి ఆలయం సమీపంలోని ఒక ప్రైవేట్ స్థలంలో నివాసం ఉంటూ, వ్యాపారం కోసం నిర్మించుకున్న షెడ్డును ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు అక్రమంగా ధ్వంసం చేశారని సదాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను క్రమం తప్పకుండా కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నానని, ట్రేడ్ లైసెన్స్, లీజ్ అగ్రిమెంట్ వంటి అన్ని చట్టబద్ధ ఆధారాలు ఉన్నప్పటికీ, తెల్లవారుజామున 5:30 గంటలకే మూడు జెసిబిలతో వచ్చి షెడ్డును కూల్చివేశారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కారణంగానే స్థానిక ఎమ్మెల్యే, మేయర్ ఒత్తిడితో అధికారులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్ గారు, ఒక దళిత బిడ్డను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వేధించడం అత్యంత అన్యాయమని అన్నారు. బాధితుడి హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాడుతుందని, అధికారుల అక్రమ చర్యలపై చట్టపరమైన పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తగా సదాంత్‌కు బీఆర్ఎస్ పూర్తి అండగా నిలుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


