Minister Ponguleti Srinivas Reddy: రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మం: ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) కల్లూరు మండలంలో పర్యటించి, సుమారు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నీరజ ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కల్లూరు మండలం నారాయణపురం కేంద్రంగా పలు గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో
రూ.2 కోట్లతో నారాయణపురం–పేరువంచ రహదారి,
రూ.4 కోట్లతో నారాయణపురం–రామకృష్ణపురం రహదారి,
రూ.7 కోట్లతో పేరువంచ–కుప్పనకుంట్ల రహదారి,
రూ.2 కోట్లతో కొత్త నారాయణపురం నుంచి ఎన్‌ఎస్‌పీ కెనాల్ లిఫ్ట్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
అనంతరం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి, ప్రహారీ గోడతో పాటు పెండింగ్ పనులన్నింటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి పల్లెకు వంద శాతం మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తున్నామని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


