Rayasamudram Lake: రాయసముద్రం చెరువును సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తాం – ప్రభుత్వానికి ప్రతిపాదనలు : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని రాయసముద్రం చెరువును సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. ఈ మేరకు పూర్తి స్థాయి అభివృద్ధి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేశారు.
చెరువు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయన్న స్థానిక అధికారులు, ప్రజల ఫిర్యాదుల మేరకు మంగళవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు, నీటి ప్రవాహ పరిస్థితులను గమనించి, స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాయసముద్రం చెరువును కేవలం నీటి వనరుగా కాకుండా, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం విస్తృతంగా ఉందని తెలిపారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ప్లే ఏరియా, పార్కులు, అన్ని వయసుల వారికి వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
వలస పక్షుల నిలయంగా ఉన్న ఈ చెరువును పూర్తి స్థాయిలో పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
- బీహెచ్‌ఈఎల్ యాజమాన్యంతో చర్చలు
చెరువులోకి మురుగు నీరు చేరకుండా దారి మళ్లించే పైపులైన్‌ల నిర్మాణం కోసం బీహెచ్‌ఈఎల్ యాజమాన్యంతో చర్చిస్తామని, వారి భూముల్లో పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. అవసరమైతే ఎస్‌టీపీ ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.
చెరువు భూములపై బీహెచ్‌ఈఎల్ మరియు ఇతర ప్రభుత్వ సంస్థల మధ్య ఉన్న సాంకేతిక వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చించి స్పష్టత ఇస్తామని తెలిపారు.
- ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
హైడ్రా అధికారులు వచ్చారంటే ఇళ్లను కూల్చేస్తారనే భయాందోళన అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్ల విషయంలో హైడ్రా జోక్యం చేసుకోదని, కేవలం నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు, అడ్డంకులను మాత్రమే తొలగించడమే లక్ష్యమని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్రమణలు తొలగించాల్సి వస్తే, ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, బీహెచ్‌ఈఎల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెరువు చుట్టూ తిరిగి ఇన్‌లెట్ల ద్వారా మురుగు నీరు చేరుతున్న విధానాన్ని కమిషనర్ స్వయంగా పరిశీలించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


