Medaram Jatara 2026: మేడారంలో సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
జాతర శాశ్వత అభివృద్ధి పనులపై సమీక్ష
ములుగు జిల్లా మేడారంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిపై సహచర మంత్రులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా శాశ్వత నిర్మాణాలు, మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
ఈ ఏడాది మేడారం జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.260 కోట్లను కేటాయించిందని తెలిపారు. ఇందులో జాతర నిర్వహణకు రూ.150 కోట్లు, శాశ్వత ఆలయాలు మరియు మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ.110 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జాతర ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతతో సమన్వయంగా పనిచేయాలని, భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


