Sadharmat Barrage: ఈనెల 16న సదర్మాట్ బ్యారేజీని జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నిర్మల్: ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటించి, ప్రతిష్టాత్మక సదర్మాట్ బ్యారేజీని జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు ప్రభుత్వ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ గారితో కలిసి బ్యారేజీ వద్ద పర్యటించి, ప్రారంభోత్సవానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.
హెలిప్యాడ్, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా చర్యలు, రాకపోకల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
సదర్మాట్ బ్యారేజీ ప్రారంభంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందనుండటంతో ఈ ప్రాంత రైతుల కల సాకారమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇది జిల్లాకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించే కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


