Sanathnagar TIMS Hospital: ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో టిమ్స్ సనత్‌నగర్ పనుల పురోగతి
హైదరాబాద్: పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ రోజున ఆస్పత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో టిమ్స్ సనత్‌నగర్ పనుల పురోగతి, డాక్టర్లు మరియు సిబ్బంది నియామకాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1000 పడకల సామర్థ్యంతో నిర్మించిన టిమ్స్‌లో 16 ఆపరేషన్ థియేటర్లు (OTs) సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అత్యాధునిక సీటీ స్కాన్ (CT Scan), ఎంఆర్‌ఐ (MRI), డిజిటల్ ఎక్స్-రే యంత్రాల ఇన్‌స్టాలేషన్ పూర్తయిందని, డయాగ్నస్టిక్ పరికరాల అమరిక తుది దశలో ఉందని వివరించారు. మార్చి రెండో వారంలోపు అన్ని పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
సనత్‌నగర్ టిమ్స్‌ను కార్డియాక్ కేర్ మరియు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. క్యాథ్‌ల్యాబ్స్, అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రత్యేక థియేటర్ల ఏర్పాటుపై ఆరా తీశారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై ఉన్న రోగుల ఒత్తిడిని తగ్గించడంలో టిమ్స్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శస్త్రచికిత్సల కోసం వేచి చూస్తున్న రోగులను ఇక్కడికి రిఫర్ చేసి త్వరితగతిన వైద్యం అందించాలని సూచించారు.
నాన్ మెడికల్ సర్వీసెస్‌పై ప్రత్యేక దృష్టి
డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియపై మంత్రి సమీక్షించారు. డీఎంఈ, నిమ్స్ పరిధిలోని సీనియర్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పారిశుధ్యం, భద్రత, పేషెంట్ కేర్ సేవలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులు, నిమ్స్, ఎయిమ్స్‌లో అమలులో ఉన్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి టిమ్స్‌లో అమలు చేయాలని సూచించారు.
టెక్నాలజీతో మెరుగైన సేవలు
రోగులకు ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు ఈ-హెచ్‌ఎంఐఎస్ (e-HMIS) సాఫ్ట్‌వేర్ ద్వారా సేవలను అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు. రోగులు, వారి సహాయకులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
మార్చి 15 నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి, ఉగాది నాటికి ఆస్పత్రిని ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


