South India Science Exhibition 2026: కొల్లూరులో దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన 2026 ఘన ముగింపు
ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ
సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు గాడియం స్కూలు క్యాంపస్‌లో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన – 2026 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజ నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులు రూపొందించిన విభిన్న శాస్త్రీయ ఆవిష్కరణల స్టాళ్లను సందర్శించి, వాటి వినియోగాలు, ప్రాయోగిక ప్రయోజనాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారి ఆలోచనా విధానాన్ని, సృజనాత్మకతను ప్రశంసించారు.
మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ,
- పోటీ ప్రపంచంలో పిల్లలు రాణించాలంటే భాషా ప్రావీణ్యం, స్కిల్ డెవలప్మెంట్, సృజనాత్మకత తప్పనిసరి అని అన్నారు.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
- సీఎం శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రాథమిక విద్య నుంచి ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తూ విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
- స్కిల్ డెవలప్మెంట్‌తో కూడిన నాణ్యమైన విద్య,
- ప్రతి సామాన్యునికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
- జిల్లాస్థాయిలోనే 90 శాతం వైద్య చికిత్సలు అందేలా ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేస్తున్నామని, సూపర్ స్పెషాలిటీ సేవల కోసం హైదరాబాద్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నర్సింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని, నర్సింగ్ విద్యార్థులు విదేశాల్లో సేవలందించేందుకు జపనీస్, జర్మన్ భాషల్లో శిక్షణ అందిస్తున్నామని మంత్రి వివరించారు.
వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి (IQ), ప్రాయోగిక జ్ఞానం పెరుగుతాయని తెలిపారు. అద్భుత ఆవిష్కరణలు చేసిన విద్యార్థులకు నగదు బహుమతులు, షీల్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థులను మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో
ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజి రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్, SECRT డైరెక్టర్ రమేష్, అదనపు కలెక్టర్ పాండు, గాడియం స్కూలు సీఈఓ రామకృష్ణ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


