Food Adulteration Hyderabad: ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీని ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు. ఆహార కల్తీ రక్కసిని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ, ఆహార భద్రతా విభాగం కలిసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నట్లు ప్రకటించారు.
బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆహార కల్తీ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన పోలీసు, ఫుడ్ సేఫ్టీ విభాగాల ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…
ఆహార కల్తీని చిన్నపాటి నేరంగా చూడబోమని, ఇది ప్రజల ప్రాణాలపైకి తెచ్చే హత్యాయత్నంగా పరిగణిస్తామని తేల్చిచెప్పారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారులనే కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలు, గోదాములు, సరఫరా వ్యవస్థలపై దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఆహార కల్తీ నియంత్రణకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించి కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. తనిఖీలు, నమూనాల సేకరణ, సీజ్‌లు, అరెస్టుల సమయంలో ఎలాంటి న్యాయపరమైన లోపాలు లేకుండా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
పదే పదే కల్తీ కేసుల్లో పట్టుబడే వ్యాపారులపై వ్యాపార లైసెన్సుల శాశ్వత రద్దు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగించేందుకు వెనుకాడబోమని సీపీ హెచ్చరించారు.
ఆహార కల్తీపై ప్రజల సహకారం కీలకమని పేర్కొన్న సీపీ, కల్తీ జరుగుతున్నట్లు సమాచారం అందించేందుకు త్వరలో ప్రత్యేక వాట్సాప్ నంబర్ లేదా టోల్‌ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డెవిస్, డీసీపీలు శ్వేత, అపూర్వ రావు, రూపేష్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల, ఫుడ్ సేఫ్టీ అధికారులు, అన్ని జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


