Malkajgiri Parliament: ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎంపీ
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని షఫీల్ గూడా కట్ట మైసమ్మ దేవాలయాన్ని ఈరోజు సందర్శించి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో అన్ని కులాలు, మతాలు ఐక్యంగా జీవిస్తున్నాయని తెలిపారు. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో జాతీయ ఐక్యత మరింత బలోపేతమై, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు.
భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్న తరుణంలో, ఈ పురోగతిని ఓర్వలేని కొన్ని మూర్ఖపు శక్తులు దేశంలో అల్లకల్లోలం సృష్టించి, అభివృద్ధిని అడ్డుకోవాలని, సామాజిక ఐక్యతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం, మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని కట్ట మైసమ్మ దేవాలయంలో జరిగిన ఘటనలు ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు. ఈ ఘటనలకు పాల్పడిన వారిని “మతిస్థిమితం లేని వారు” లేదా “బయటి వ్యక్తులు” అంటూ తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
మతిస్థిమితం లేని వారు అయితే అన్ని మతాల ప్రార్థనా స్థలాలపై దాడులు జరగాలి కదా? కానీ కేవలం హిందూ దేవాలయాలనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రశాంత ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలకు దారితీయవచ్చని హెచ్చరించారు.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా కేవలం శుభ్రం చేయడం, పూజలు నిర్వహించడం సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలంటే దీనికి కారణమైన వారిని గుర్తించి, ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
“సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్” అనే నినాదంతో ప్రధాని మోదీ గారు దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని, ఆ కమిట్మెంట్‌ను దెబ్బతీసేలా చిల్లర రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు.
అలాగే బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ ఏర్పడిన సమయంలో 17 శాతం ఉన్న హిందువుల జనాభా నేడు తీవ్రంగా తగ్గిపోతున్నదని, అక్కడి ప్రభుత్వం తప్పుడు మార్గంలో నడుస్తోందని అన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను ఆపడం బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత అని, అలా జరగకపోతే భారతదేశం తగిన విధంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


