Arrest of auto union leaders: అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలు
ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువస్తామని, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలు, వేలాది మంది ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ల నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. వేలాది మంది ఆటో డ్రైవర్లను అనేక పోలీస్ స్టేషన్లలో అదుపులోకి తీసుకొని బంధించి ఉంచడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ, ఆ హామీల అమలును ప్రశ్నిస్తే నిర్బంధాలు, అరెస్టులతో గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన ఆటో యూనియన్ నేతలను, ఆటో అన్నలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటనను, ఆటో అన్నలు కోరినట్లుగానే ఈరోజే అసెంబ్లీలో ప్రభుత్వం చేయాలని ఆయన కోరారు.
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగకుండా ఉండాలంటే, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


