Secunderabad District: రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి – కేటీఆర్
నిరసన తెలిపే హక్కును కూడా ప్రజల నుంచి లాక్కోవడమే ప్రజాపాలనా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని చేతబట్టి తామే దాని పరిరక్షకులమని చెప్పుకునే రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామిక చర్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చినందుకే బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం, తెలంగాణ భవన్‌లోనే నిర్బంధించడం తీవ్ర అన్యాయమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అనుమతితో మళ్లీ బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ అస్తిత్వాన్ని బీఆర్‌ఎస్ ఏనాడూ టచ్ చేయలేదని, కానీ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ నేతలందరినీ వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఇది రాజకీయ పోరాటం కాదని, ఆత్మగౌరవం, అస్తిత్వ పోరాటమని పేర్కొన్నారు. అలాగే బీఆర్‌ఎస్ నేత దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, సికింద్రాబాద్‌ను జిల్లాగా ప్రకటించే వరకు తమ కవాతు ఆగదని స్పష్టం చేశారు.
ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేటీఆర్ విమర్శించారు. చిన్న జిల్లాలతో ప్రజలకు పాలన చేరువ అవుతుంటే, రేవంత్ రెడ్డికి ఎందుకు ఇబ్బంది కలుగుతోందో అర్థం కావడం లేదన్నారు.
శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలను అరెస్టు చేయడమే ప్రజాపాలనా అని ప్రశ్నించిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ హామీల అమలును పక్కనపెట్టి పేర్లు మార్చడంపైనే దృష్టి పెట్టిందని మండిపడ్డారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి, బతుకమ్మను తొలగించి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చారని విమర్శించారు.
ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు సికింద్రాబాద్‌ను జిల్లాగా మారుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


