Godavari Drinking Water Supply: గోదావరి మెయిన్ పైపులైన్ లీకేజ్
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలోని శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి వద్ద ఉన్న 3000 మిల్లీమీటర్ల డయామీటర్ ఎంఎస్ మెయిన్ పైపులైన్లో లీకేజీ ఏర్పడటంతో అత్యవసర మరమ్మతులు చేపట్టారు.
ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీతో కలిసి ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి లీకేజీ ఘటన, చేపడుతున్న మరమ్మతులపై సమీక్షించారు. ఇప్పటికే డీ-వాటరింగ్ పనులు పూర్తి చేసి వెల్డింగ్ పనులు ప్రారంభించామని, ఇవి సాయంత్రం 4 గంటలలోపు పూర్తవుతాయని అధికారులు ఎండీకి వివరించారు.
నిర్దేశించిన లక్ష్యం మేరకు 18 గంటల్లోగా (03.01.2026 శనివారం రాత్రి 12 గంటలలోపు) మరమ్మతుల పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు గ్యాంగ్‌లను ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
లీకేజీ కారణంగా నీటి సరఫరా అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్యాంకర్ల ద్వారా 24 గంటల పాటు నీటి సరఫరా చేయాలని, ప్రతి జీఎం తన పరిధిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలు, కనెక్షన్లపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
మరమ్మతుల ప్రాంతంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నీటి సరఫరా అంతరాయం వివరాలను సోషల్ మీడియా, లైన్‌మెన్లు, మీటర్ రీడర్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని, స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎండీ, ఈడీ గంటగంటకు పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఈ సమయంలో నీటిని పొదుపుగా వినియోగించి, వృథా కాకుండా చూడాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


