Warangal Police Commissioner: శాంతి భద్రతల పరిరక్షణ పనితీరు అభినందనీయం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ పోలీసుల పనితీరు అభినందనీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం వరంగల్ సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగాన్ని కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకున్న కమిషనర్‌కు ఆర్ముడ్ రిజర్వ్ అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్‌ను తిలకించిన సీపీ, సిబ్బంది ఆయుధాలపై కలిగిన పరిజ్ఞానం, ఆయుధాల వినియోగ విధానాలు, ఆయుధ పరేడ్, శారీరక వ్యాయామాలు, యోగా తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని గుర్తించి క్షేత్ర స్థాయిలోనే రివార్డులను ప్రకటించారు.
అనంతరం డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ యూనిట్, మోటార్ విభాగం, ఆయుధాగారం వంటి విభాగాల పనితీరును కమిషనర్ సమీక్షించారు. సిబ్బంది విధులు, సామగ్రి నిర్వహణ, అప్రమత్తత స్థాయిపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రుద్రమ ఉమెన్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విన్యాసాలు ఆకర్షణ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైన అనంతరం తొలిసారిగా ఏర్పాటు చేసిన రుద్రమ ఉమెన్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగం విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు పురుషులతో సమానంగా కమాండో తరహా ప్రత్యేక శిక్షణ పూర్తి చేయడంతో పాటు ఆయుధ శిక్షణ, దేహదారుఢ్య శిక్షణలో తమ ప్రతిభను చాటారు.
ఈ సందర్భంగా కళ్లకు గంతలు కట్టుకుని ఆయుధాలను విడదీయడం, తిరిగి సమర్థవంతంగా జోడించడం వంటి క్లిష్టమైన విన్యాసాలను సిబ్బంది ప్రదర్శించగా, కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. రుద్రమ ఉమెన్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.
తనిఖీల అనంతరం సీపీ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అప్పగించిన బాధ్యతలను పూర్తి అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు. శాఖాపరంగా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, రవి, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్రా, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్‌ఐ స్పర్జన్ రాజ్, సతీష్, శ్రీధర్, చంద్రశేఖర్‌తో పాటు ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


