Palamuru Development CM: పాలమూరును తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతాం
ఒకప్పుడు తట్టపని, మట్టిపని, పారపని కోసం వలసలు వెళ్లిన పాలమూరు జిల్లాను తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణ పర్యటనకు వచ్చే వారు తప్పనిసరిగా పాలమూరు జిల్లాను సందర్శించేలా అభివృద్ధి చేయాలన్నదే తన కల అని తెలిపారు.
‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. గతంలో పాలమూరులోని పేదరికాన్ని చూపిస్తూ గ్రాంట్లు తెచ్చుకునే పరిస్థితులు బాధాకరమని, పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
పాలమూరు జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణాలు సాగునీటి సౌకర్యాల లోపం, విద్యావకాశాల లేమి అని పేర్కొన్న ముఖ్యమంత్రి, చదువులకు అవసరమైన నిధులు అందించే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు.
విద్య, నీటిపారుదల రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, జూరాల ప్రాజెక్టులు, ఆర్డీఎస్ పనులు పూర్తిచేసే బాధ్యత తమ ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్ & ఆర్ సమస్యలను ముందుగా పరిష్కరిస్తామని చెప్పారు.
తెలంగాణకు ఐఐఎం సాధించి మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలసి కోరనున్నట్లు వెల్లడించారు. అలాగే మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ.1500 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు, భూములు కోల్పోయే రైతులకు నూటికి నూరు శాతం నష్టపరిహారం చెల్లించి ప్రజల ఆమోదం పొందామని తెలిపారు.
పేదరికం, నిరక్షరాస్యత తనకు శత్రువులని, చదువుకు అడ్డు తగిలే వారిని సహించబోనని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి పాలమూరును అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, ఎంపీలు మల్లురవి గారు, అరుణ గారు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


