Telangana movie ticket rates: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు
తెలంగాణలో ప్రస్తుతం థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి నియంత్రణలో ఉందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని పేర్కొంది.
ఒకవైపు సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించి జీవోలు వెలువడుతుండగా, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహిస్తున్న సినిమాటోగ్రఫీ మంత్రి తనకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని, ఫైల్ తన వద్దకు రాలేదని చెప్పడం పాలనా గందరగోళానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ ఆరోపించింది. శాఖ ఒకరిది, నిర్ణయాలు మరొకరివి, జీవోలు ఇంకొకరు జారీ చేస్తున్నారని విమర్శించింది.
సాక్షాత్తూ ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే కీలక నిర్ణయాలు జరుగుతున్నాయంటే రాష్ట్రాన్ని నడిపిస్తున్నది ఎవరు? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు సంధించింది. ఇది సర్కార్ పాలనా? లేక సర్కస్ పాలనా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు హెచ్చరికలు చేసినప్పటికీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోవడం శోచనీయమని బీఆర్‌ఎస్ పేర్కొంది. అసెంబ్లీ వేదికగా సీఎం చేసిన హామీలు ఒకటైతే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్ణయాలు మరోలా ఉన్నాయని ఆరోపించింది.
ముఖ్యమంత్రి అసెంబ్లీలో ‘టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు’ అని ప్రకటించినప్పటికీ, రాత్రికి రాత్రే జీవోలు జారీ కావడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని బీఆర్‌ఎస్ విమర్శించింది. ఇప్పటికే మూడు సినిమాలకు టికెట్ ధరలు పెంచుతూ జీవోలు ఇచ్చారని, మరిన్ని సినిమాలకు కూడా అదే విధంగా అనుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని పేర్కొంది.
సినిమాటోగ్రఫీ మంత్రి పరిస్థితి దయనీయంగా మారిందని, హోం శాఖ జీవోలు జారీ చేస్తుంటే సినిమా మంత్రి తనకు సంబంధం లేదని చెప్పడం ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలను బయటపెడుతోందని ఆరోపించింది. తెలంగాణలో సినిమా శాఖకు నిజంగా మంత్రి ఉన్నారా? లేరా? అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించింది.
సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూడకుండా, రాజకీయ కక్షలు తీర్చుకునే వేదికగా మార్చారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ఒక సినిమాకు అనుమతులు ఆలస్యం చేస్తూ, మరో సినిమాకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని తెలిపింది.
గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సినిమా పరిశ్రమను ఎలాంటి వివక్ష లేకుండా ప్రోత్సహించామని, అందుకే తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని బీఆర్‌ఎస్ గుర్తు చేసింది. దశాబ్దాల కష్టంతో నిర్మితమైన పరిశ్రమను అహంకారం, పగ ప్రతీకారాలతో నాశనం చేస్తున్నారని ఆరోపించింది.
సినిమా టికెట్ రేట్ల పెంపులో రాజ్యాంగేతర శక్తుల పాత్ర ఉందని, కమిషన్ల దందా జరుగుతోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తూ, దీనిపై గవర్నర్ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


