GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పాటించవలసిన వ్యూహాలు
తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పి. వివేకానంద్ స్పష్టం చేశారు.
ఈరోజు చింతల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమన్వయ సమావేశానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పాటించవలసిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలకు వారు దిశానిర్దేశం చేశారు.
అనంతరం భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన క్యాలెండర్, డైరీలను ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని తెలిపారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ప్రజలను మోసం చేసిన తీరును ప్రజలు గుర్తించారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ ఎవరికి వచ్చినా ప్రతి నాయకుడు, కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారినే కేంద్రంగా ఉంచుకొని ముందుకు సాగాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసినప్పుడే అభ్యర్థి గెలుపు సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్యాక్స్ డైరెక్టర్లు, పార్టీ మున్సిపాలిటీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్లు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


