Municipal reservations Telangana: మున్సిపల్ రిజర్వేషన్ల ప్రక్రియను అపహాస్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం – బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి
మేడ్చల్ : రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఒక్క లక్ష్యంతో ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలను గాలికొదిలి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతోందని బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎరుదాటగానే తెడ్డు తిరగేసినట్లుగా, మున్సిపాలిటీల్లో వార్డుల విభజన మరియు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తిగా రాజకీయ స్వార్థానికి అనుగుణంగా, అస్తవ్యస్తంగా చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో జనాభా లెక్కలు, సామాజిక సమీకరణలను పక్కనపెట్టి, కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలకు లాభం చేకూర్చే విధంగా తప్పుడు లెక్కలతో రిజర్వేషన్లను ఖరారు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.
ఈ అంశంపై బీజేపీ వద్ద స్పష్టమైన ఆధారాలు, నిజమైన గణాంకాలు ఉన్నాయని పేర్కొన్న ఏనుగు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలపై న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టంగా ప్రకటించారు.
ప్రజల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను బట్టబయలు చేస్తూ ఈ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చుతామని ఆయన హెచ్చరించారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


