Drugs party: డ్రగ్స్ పార్టీలో కేసీఆర్ కుటుంబసభ్యులు..
డ్రగ్స్ కేసుల (Drugs party)విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన డ్రగ్స్ కేసుల విచారణపై కీలక వ్యాఖ్యలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
అకున్ సబర్వాల్ నివేదికపై చర్యలేమిటి?
కేసీఆర్ హయాంలో అకున్ సబర్వాల్ నేతృత్వంలో నిర్వహించిన డ్రగ్స్ కేసు విచారణ నివేదికపై ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ విచారణలో అనేక మంది బడా వ్యక్తులు, సినీ ప్రముఖుల పేర్లు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు
నాటి డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులను అకున్ సబర్వాల్ టీం విచారించగా, కేసీఆర్ కుటుంబ సభ్యులకు డ్రగ్స్ విక్రయదారులతో సంబంధాలున్నట్లు తేలిందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా తమతో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు విచారణ సమయంలో వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు.
ఆడియో, వీడియో బయటకొస్తే రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం
డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు బయటకొస్తే తమ కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుందనే భయంతోనే నాటి సీఎం కేసీఆర్ అకున్ సబర్వాల్‌ను అర్దాంతరంగా డ్రగ్స్ కేసు బాధ్యతల నుంచి తప్పించారని బండి సంజయ్ ఆరోపించారు.
సోమేశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు
డ్రగ్స్ కేసుకు సంబంధించిన నివేదికలు, ఆడియో, వీడియో రికార్డులు, నిందితుల వాంగ్మూలాలను నాటి సీఎస్ సోమేశ్ కుమార్ స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ టీంకు అప్పగించలేదని బండి సంజయ్ ఆరోపించారు. వాటిని కోర్టుకు కూడా సమర్పించలేదని తెలిపారు. ఈ చర్యల వల్ల డ్రగ్స్ కేసును పూర్తిగా నీరుగార్చారని విమర్శించారు.
మీడియాకు ప్రకటన విడుదల
ఈ అంశాలపై బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం మీడియాకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. డ్రగ్స్ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరిపి, అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలను తిరిగి వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


