Harish Rao : సింగరేణి ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్న ప్రభుత్వం
సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఇవాళ సింగరేణి డైరెక్టర్ గౌతమ్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సింగరేణి సంస్థ ఆర్థిక స్థితిని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలైన డిస్కాంలు, జెన్‌కో నుంచి సింగరేణికి రూ.42 వేల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉండగా, వాటిని చెల్లించకపోవడం వల్ల సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఈ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల జీతాలపై ప్రభావం
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కార్మికుల జీతాలు, సంక్షేమంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని హరీశ్ రావు హెచ్చరించారు. కార్మికులు జీతాల కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి నిధులతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి నిధుల దుర్వినియోగం ఆరోపణ
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన లియోనల్ మెస్సీ ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు సింగరేణి నిధుల నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాల్సిన నిధులను వినోద కార్యక్రమాలకు వెచ్చించడం అన్యాయమని అన్నారు.
బోనస్ కోతపై తీవ్ర విమర్శలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.6,394 కోట్ల నికర లాభం సాధించినా, బోనస్ కోసం కేవలం రూ.2,360 కోట్లనే పరిగణించి 34 శాతం మాత్రమే ఇవ్వడం ద్వారా కార్మికులను మోసం చేశారని హరీశ్ రావు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం లాభంపైనే బోనస్ ఇచ్చేవారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హెచ్చరిక
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి నిధుల దుర్వినియోగంపై విచారణ చేస్తామని, అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హరీశ్ రావు హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


