Harish Rao Comments: అధికారులు, పోలీసులను రిటైర్మెంట్ అయినా వదిలిపెట్టేది లేదని
చట్టాన్ని అతిక్రమిస్తూ, న్యాయబద్ధంగా వ్యవహరించకుండా ప్రభుత్వ ఆదేశాల పేరుతో అక్రమాలకు పాల్పడే అధికారులు, పోలీసులను రిటైర్మెంట్ అయినా వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర హెచ్చరిక చేశారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామని స్పష్టం చేశారు. రేపు అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు చట్టాన్ని అతిక్రమించిన ప్రతి ఒక్కరూ తమ సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను ఎస్‌ఐటీ (SIT)లో పెట్టి బీఆర్ఎస్‌పై ప్రయోగాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదన్నారు.
చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చినా సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దావోస్ నుంచి ఇచ్చే డైరెక్షన్ల ప్రకారం కాదు, చట్టం ప్రకారం పనిచేయాలని సూచించారు. తప్పుడు ఆదేశాలను పాటించి చట్టాన్ని ఉల్లంఘిస్తే దానికి పూర్తి బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న కుట్రలు, బెదిరింపులు రేవంత్ రెడ్డి రాజకీయ పన్నాగమేనని ఆరోపించారు. తాము తప్పు చేయలేదని, ఎవరికీ భయపడేది లేదని, కేటీఆర్ గారు ధైర్యంగా విచారణకు హాజరయ్యారని తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దుష్ప్రచారంపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా కేటీఆర్‌పై సోషల్ మీడియా, టీవీలు, పత్రికల్లో ప్రచారం జరిగినప్పుడు అధికారులు ఏం చేశారని నిలదీశారు. రేవంత్ రెడ్డిపై కూడా విచారణ జరిపించి అన్ని విషయాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


