Karimnagar Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన జనసేన పార్టీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ ప్రచార కార్యదర్శి మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్.కే. సాగర్ గారు స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిన్న ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికల బరిలోకి దిగుతామని తెలిపారు. ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
యువత ఎక్కువ సంఖ్యలో రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, అప్పుడే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆర్.కే. సాగర్ అన్నారు. నియోజకవర్గాల వారీగా కొత్త నాయకులను గుర్తించి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, వారికి జనసేన కండువా కప్పి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నామని వెల్లడించారు.
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడే రాజకీయమే జనసేన లక్ష్యమని, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రధాన అజెండాగా ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు.
ఈ పత్రికా సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు చెందిన నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావవంతమైన శక్తిగా అవతరిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


