Kalvakuntla Kavitha Amanagal visit: ఆమన్‌గల్ డంపింగ్ యార్డును పరిశీలించిన కల్వకుంట్ల కవిత
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్‌గల్ పట్టణం గుర్రగుట్టం కమల్ నగర్‌లో ఉన్న డంపింగ్ యార్డును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని, ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
జనావాసాల మధ్య భారీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు గత ఆరేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ తొలగించాలని ప్రజలు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, అధికారులకు దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
ఈ డంపింగ్ యార్డ్ కారణంగా స్థానికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇటీవల ఓ బాలింత మృతి చెందినట్లు ప్రజలు చెబుతున్నారని తెలిపారు. చెత్తను రోజూ కాల్చడం వల్ల విషవాయువులు వ్యాపించి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం పెరుగుతోందని హెచ్చరించారు.
ఇక్కడి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ సమస్యపై తక్షణమే దృష్టి పెట్టాలని, మున్సిపల్ కమిషనర్‌ను పిలిపించి స్వయంగా ప్రాంతాన్ని పరిశీలించాలని కవిత డిమాండ్ చేశారు. చెత్తశాఖ మంత్రి ముఖ్యమంత్రే అయినందున, డిమాండ్ కాకుండా కమాండ్ చేసి ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు.
ఇప్పటికే ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం కోటి 20 లక్షలు మంజూరు చేసినప్పటికీ, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ పాత డంపింగ్ యార్డ్ కొనసాగించడం అన్యాయమని ఆమె అన్నారు. 1994లో గుట్టలపై చిన్న ఇళ్లను ఇచ్చి, ఇప్పుడు అదే ప్రాంతంలో ఉండలేకుండా చేస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు.
ఫిబ్రవరిలో తమ యాత్ర పూర్తయ్యే వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తామే ముందుకు వచ్చి డంపింగ్ యార్డ్‌ను శుభ్రం చేస్తామని కవిత స్పష్టం చేశారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి అయినా డంపింగ్ యార్డ్ తొలగిస్తామని హెచ్చరించారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


