KCR’s monthly salary controversy: కేసీఆర్ నెల జీతం కోసం అసెంబ్లీకి వచ్చి వెళ్లారు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అయితే సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోవడంతో రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పరిణామంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, కేసీఆర్ సభకు రావడం ప్రజా సమస్యల కోసం కాదని, కేవలం నెల జీతం తీసుకోవడం, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడుకోవడానికే వచ్చారని ఎద్దేవా చేశారు.
సోషల్ మీడియాలో హైప్.. సభలో రెండు నిమిషాలూ లేదు
కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో భారీ హైప్ సృష్టించాయని, కానీ వాస్తవంగా చూస్తే రెండు నిమిషాలు కూడా సభలో ఉండకుండా వెళ్లిపోయారని బీర్ల ఐలయ్య విమర్శించారు. ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేకపోవడమే దీనికి కారణమని అన్నారు.
దళితుల పట్ల వివక్ష మరోసారి బయటపడిందన్న ఆరోపణ
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మరింత ఘాటుగా స్పందించారు.
సభలో ఉన్న దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను “అధ్యక్షా” అని సంబోధించాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ మైక్ అడగలేదని, అందుకే మాట్లాడకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. ఈ సంఘటనతో దళితుల పట్ల కేసీఆర్‌కు ఉన్న వివక్ష మరోసారి బయటపడిందని అన్నారు.
“కేసీఆర్‌కు దళితులపై ఎంత ప్రేమ ఉందో ఈ ఘటనతో ప్రజలు అర్థం చేసుకోవాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్న ప్రభుత్వ విప్
అసెంబ్లీకి వచ్చి చర్చలకు దూరంగా ఉండటం, కేవలం ఫార్మాలిటీ కోసమే హాజరై వెళ్లడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీర్ల ఐలయ్య దుయ్యబట్టారు. ప్రజలు తమను ఎన్నుకున్న ఉద్దేశాన్ని కేసీఆర్ విస్మరించారని ఆయన మండిపడ్డారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


