KTR comments on Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ “నిజాయితీ కలిగిన మోసగాడు” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ రోజు తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నేత కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు గడిచినా ఎన్నికల హామీల్లో ఒక్కదాన్నీ అమలు చేయలేదన్నారు. రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్‌సీ వంటి కీలక హామీలను కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతను పిలిచి భరోసా ఇవ్వాలని, ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. మీడియా హెడ్‌లైన్ల కోసం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను కాకుండా దాన్ని అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న నిరుద్యోగుల ఆందోళనలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నియామక పత్రాలను తన ఘనతగా చెప్పుకోవడం తప్పుడు ప్రచారమని అన్నారు.
రేవంత్ రెడ్డి రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి అసహనానికి గురవుతూ అసభ్య భాషలో స్పందిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


