Dindi lift irrigation: డిండి ఎత్తిపోతల పథక నిర్వాసితుల ఆందోళనకు మద్దతు.. ఎర్రవెల్లి–గోకారం ప్రజలతో కల్వకుంట్ల కవిత
డిండి ఎత్తిపోతల పథకం (Dindi Lift Irrigation Project)లో భాగంగా ఎర్రవెల్లి – గోకారం నిర్వాసితులు చేపట్టిన ఆందోళనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సాగుతున్న ఈ నిరసనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణలో నీటి వనరుల ప్రణాళికల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని విమర్శించారు. గోదావరి, కృష్ణా నదులపై అనేక ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ, రైతులకు ఆశించిన స్థాయిలో నీళ్లు అందడం లేదన్నారు.
డిండి ప్రాజెక్ట్‌పై కవిత కీలక వ్యాఖ్యలు
కృష్ణా నది ద్వారా 25 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉండగా, గతంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసినా పెద్ద ఎత్తున సాగునీరు అందే పరిస్థితి ఉండేదని కవిత గుర్తు చేశారు. కానీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా పూర్తికాకపోవడం దురదృష్టకరమన్నారు.
డిండి ప్రాజెక్ట్‌లో భాగంగా గోకారం చెరువు అంశాన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉందని కవిత సూచించారు. గోకారంలో 900 ఎకరాలు, ఎర్రవెల్లిలో 600 ఎకరాల భూమి సేకరణ ప్రతిపాదన ఉందని తెలిపారు. మొత్తం 1500 ఎకరాల భూమిని తీసుకుని కేవలం 2000 ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతాయంటే అది న్యాయమా? అని ప్రశ్నించారు.
ప్రజల నిరసనను పట్టించుకోని పాలకులు
గోకారం చెరువును మరింత పటిష్టం చేస్తే, భూములు కోల్పోకుండా నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని కవిత తెలిపారు. అయినప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరం అని అన్నారు.
ఈ నిర్లక్ష్యానికి నిరసనగా ఎర్రవెల్లి గ్రామ ప్రజలు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించినా, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలు, చివరకు ఎన్నికల కమిషన్ కూడా స్పందించకపోవడం దారుణం అని విమర్శించారు.
“ఓటు హక్కు ఉన్న ప్రజలను పట్టించుకోకపోతే ఎర్రవెల్లి వాసులు మనుషులు కాదా?” అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు వెళ్తా: కవిత
ఈ అంశాన్ని తాను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నానని, అవసరమైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు తీసుకెళ్తానని కవిత స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని డిమాండ్ చేశారు.
ఒకటి రెండు రోజుల్లో స్పందన లేకపోతే ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రిని కూడా నిలదీయాలని ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు.
“ఎర్రవెల్లి గ్రామం, ఎర్రవెల్లి తాండ ప్రజల పోరాటానికి మీ సోదరిగా నా సంపూర్ణ మద్దతు ఉంటుంది” అని కవిత హామీ ఇచ్చారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


