SRSP Stage 2 Canal: కల్వకుంట్ల కవిత ఆందోళన
తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు సాగునీరు అందించే ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్–2 కాల్వను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వెలుగుపల్లి గ్రామంలోని రుద్రమ చెరువును కూడా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో పంట కాల్వల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కాల్వల్లో కంపచెట్లు పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మెయింటెనెన్స్‌కు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) విభాగానికి కనీస నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కోదాడ వరకు నీళ్లు అందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వ సుమారు 70 కిలోమీటర్లు పొడవు ఉండగా, దానిని సరిగా నిర్వహించకపోవడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని తెలిపారు.
అలాగే 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రుద్రమ దేవి చెరువుకు గోదావరి నీళ్లు రావాల్సి ఉన్నా, కిలోమీటర్‌కు పైగా డిస్ట్రిబ్యూటరీ కాల్వ తవ్వకాలు జరగకపోవడంతో నీరు చేరడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఈ చెరువును 5 టీఎంసీల రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తామని రెండు ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లక్నవరం తరహాలో టూరిస్ట్ ప్లేస్‌గా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.
ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్–2 ప్రాజెక్ట్‌లో భాగంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని, ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


