Telangana Assembly Winter Session: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవనంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (Telangana Assembly Winter Session )షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలో జనగణమన జాతీయ గీతాలాపన నిర్వహించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను ప్రారంభించి, ఇటీవల మృతి చెందిన మాజీ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా తుంగుతుర్తి, సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు శాసనసభ సభ్యులు సంతాపం తెలియజేశారు.
జిరో అవర్‌లో ఎమ్మెల్యేలు సమస్యల ప్రస్తావన
సంతాప తీర్మానాల అనంతరం జిరో అవర్ ప్రారంభమైంది. ఈ సమయంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతిలో తెలంగాణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వసతి సౌకర్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
శబరిమలలోనూ తెలంగాణ భవన్ నిర్మాణంపై డిమాండ్
అదేవిధంగా శబరిమలలో కూడా తెలంగాణ భవన్ నిర్మించాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను మంత్రి జూపల్లి కృష్ణారావు నోట్ చేసుకున్నట్లు సభలో ప్రకటించారు.
శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు, కీలక విధానాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో సభా కార్యక్రమాలు ఆసక్తికరంగా కొనసాగనున్నాయి.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


