Palamuru Rangareddy project dispute: నీళ్లు – నిజాలపై ప్రజా భవన్‌లో ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
ప్రజా భవన్‌లో “నీళ్లు – నిజాలు” అంశంపై సాగునీటి పారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సాగునీటి రంగంలో గత ప్రభుత్వాల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేశారు.
2014–2023 మధ్యకాలానికి సంబంధించిన ఇరిగేషన్ రికార్డులను పరిశీలిస్తే, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావుల నిర్ణయాల వల్లే తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
జూరాల వద్ద నిర్మించాల్సిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలం బ్యాక్‌వాటర్‌కు మార్చడం కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదమని విమర్శించారు. కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో రాష్ట్ర విభజన తర్వాత పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 79 శాతం వాటా డిమాండ్ చేయాల్సి ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలకు మాత్రమే అంగీకరించి సంతకాలు చేయడం దక్షిణ తెలంగాణ పాలిట మరణశాసనంగా మారిందన్నారు.
కేసీఆర్ నిర్ణయాల వల్లే దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల ఏపీ రోజుకు 13.37 టీఎంసీలకు పైగా నీటిని తరలించుకునే అవకాశం దక్కిందని, అదే సమయంలో తెలంగాణ మాత్రం 0.25 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని పరిస్థితికి చేరిందని ఆరోపించారు.
జూరాలను వదిలి శ్రీశైలం వద్ద నీళ్లు ఎత్తిపోసే ప్రతిపాదన కారణంగా మూడు స్టేజీలు ఐదు స్టేజీలుగా, 22 పంపులు 37 పంపులుగా మారాయని, వ్యయం 32 వేల కోట్ల నుంచి 84 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపారు. “తల దగ్గర నీళ్లు తీసుకోకుండా తోక దగ్గర నుంచి తీసుకోవడం ఎక్కడి లాజిక్?” అని ప్రశ్నించారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేవలం తాగునీటి ప్రాజెక్టుగా చూపించి 7.15 టీఎంసీలకు మాత్రమే అనుమతులు తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. లిఫ్ట్ కాంట్రాక్టర్ల బిల్లులకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.
పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 79 శాతం, ఏపీకి 21 శాతం కృష్ణా జల వాటా ఇవ్వాలని తమ ప్రభుత్వం వాదిస్తోందని, కేసీఆర్ చేసిన తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు.
ఈ అంశంపై కేసీఆర్ శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొనాలని ఆయన సవాల్ విసిరారు. పత్ర సహితంగా నిజానిజాలను సభ వేదికగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతిమంగా తెలంగాణ జల హక్కులను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


