Jagadish Reddy comments: కాంగ్రెస్‌పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT)కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతుంటే ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో PPT పెట్టేందుకు అవకాశం ఇస్తే తెలంగాణలో అసలు దొంగలెవరో ప్రజలకు స్పష్టంగా బయటపడతారని ఆయన అన్నారు.
ఆంధ్ర నల్లమల సాగర్ నీటిదోపిడీ అంశంపై మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి PPT అవకాశం నిరాకరించడం వెనుక రాజకీయ భయం ఉందని విమర్శించారు. “ఆనాడు మీరు అడ్డుకున్నట్లు మేము అడ్డుకోము. అసెంబ్లీలో PPTకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ బండారం బయటపడుతుంది” అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అడిగిన PPTలో కాంగ్రెస్ పాలనలో జరిగిన అక్రమాలు, నీటివాటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని స్పష్టంగా చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ స్క్రీన్‌పైనే కాంగ్రెస్ అసలు రంగును బయటపెడతామని హెచ్చరించారు.
PPTకి అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ తీరును ప్రజల్లో ఎండగడతామని, శాసనసభలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, వివరణలకు అవకాశం లేకుండా చేయడం ప్రభుత్వ వైఫల్యమని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


