Divorce Petition: క్రూరత్వాన్ని నిరూపించాల్సిందే
విడాకుల కేసుల్లో( divorce petition ) కేవలం ఆరోపణలు సరిపోవు, వాటిని బలమైన సాక్ష్యాలతో నిరూపించాల్సిందే అని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. భార్యపై క్రూరత్వం ఆరోపణలతో భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ, కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
ఈ కేసును తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం, జస్టిస్ కె. లక్ష్మణ్ మరియు జస్టిస్ వి. రామకృష్ణ రెడ్డిలతో కూడిన బెంచ్ విచారించింది.
కుటుంబ న్యాయస్థానం తీర్పును సమర్థించిన హైకోర్టు
సికింద్రాబాద్ కుటుంబ న్యాయస్థానం గతంలో భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాకుండా, దాంపత్య హక్కుల పునరుద్ధరణ (Restitution of Conjugal Rights) కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు కూడా కుటుంబ న్యాయస్థానం తీర్పులో ఎలాంటి లోపం లేదని పేర్కొంది.
భర్త చేసిన ఆరోపణలు ఏమిటంటే…
భర్త వాదన ప్రకారం, భార్య:
-
తరచూ దుర్భాషలాడడం
-
అనవసరంగా గొడవలు పడటం
-
అత్తమామల జోక్యాన్ని పెంచడం
-
రాత్రి వేళల్లో ఎక్కువసేపు ఫోన్ వినియోగించడం
వంటి కారణాల వల్ల తనకు మానసిక క్రూరత్వం ఎదురైందని పేర్కొన్నారు. ఈ కారణాలతో తన వైవాహిక జీవితం అసహ్యంగా మారిందని, ఇక కలిసి జీవించడం అసాధ్యమని వాదిస్తూ వివాహ రద్దు కోరారు.
క్రూరత్వానికి స్పష్టమైన ఆధారాలు లేవని వ్యాఖ్య
అయితే, హైకోర్టు ఈ ఆరోపణలకు స్వతంత్ర మరియు నమ్మదగిన సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది.
కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు, అనుమానాలు లేదా సాధారణ గృహ కలహాలు క్రూరత్వంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది.
క్రూరత్వం అన్నది చట్టపరంగా నిరూపించాల్సిన అంశమని, దానికి సరైన ఆధారాలు అవసరమని స్పష్టంచేసింది.
విడాకుల కేసులకు కీలక మార్గదర్శక తీర్పు
ఈ తీర్పు ద్వారా, భవిష్యత్తులో విడాకుల కేసులు వేయాలనుకునే వారికి హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చినట్లయింది.
ఆరోపణలు కాకుండా, సాక్ష్యాలే న్యాయస్థానంలో కీలకం అనే అంశాన్ని ఈ తీర్పు మరోసారి నొక్కిచెప్పింది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


